స్త్రీపురుష కలయిక లేకుండానే జన్మించడాన్ని సాక్ష్యంగా చూపుతూ కొందరు జీసస్ కూడా దేవుడని వాదిస్తున్నారు. అయితే, తండ్రి అవసరం లేకుండా అంటే స్త్రీపురుష కలయిక లేకుండా ఉనికిలోనికి వచ్చినవారిలో జీసస్ మొదటివారు కాదు. జీసస్ కంటే ముందు ఉనికి లోనికి వచ్చిన ఆదిమానవుడు ఆదం అలైహిస్సలాంకు తల్లీ, తండ్రీ ఇద్దరూ లేరు.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉన్నది:
“నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ‘ఈసా ఉపమానం, ఆదం ఉపమానం వంటిదే. ఆయన (ఆదంను) మట్టితో సృజించి: ‘అయిపో’ అని అన్నాడు, అంతే అతను అయిపోయాడు. ఈ సత్యం నీ ప్రభువు తరుఫు నుండి వచ్చింది. కావున నీవు శంకించే వారిలో చేరిన వాడవు కావద్దు.
”ఖుర్ఆన్ 3:59-60
ఒకవేళ తండ్రి లేకుండా జన్మించారని జీసస్ ను ఆరాధించాలనుకుంటే, అలా ఆరాధింపబడే హక్కును ఆయన కంటే ఎక్కువగా ఆదము కలిగి ఉన్నారు ఎందుకంటే ఆదము తల్లీ, తండ్రీ లేకుండా సృష్టించబడినారు.
జీసస్ (అలైహిస్సలాం) మహిమలు
స్త్రీపురుష కలయిక అవసరం లేకుండానే జన్మించిన జీసస్ అలైహిస్సలాం జననం ఒక గొప్ప మహిమ.
అంతేగాక ఆయన తన జీవిత కాలంలో అల్లాహ్ అనుజ్ఞతో అనేక గొప్ప మహిమలు చేసి చూపారు. తన తల్లి శీలాన్ని శంకించిన ప్రజలకు ఉయ్యాలలో దినాల పసిబిడ్డగా ఉన్నప్పుడే, అల్లాహ్ అనుజ్ఞతో స్వయంగా జవాబిచ్చారు. ఇంకా, జీసస్ అలైహిస్సలాం మృతులను సజీవులుగా చేసారు, కుష్ఠురోగుల రోగాన్ని దూరం చేసారు, అంధులకు కంటిచూపు ప్రసాదించారు – ఇదంతా ఆయన కేవలం అల్లాహ్ అనుజ్ఞతోనే చేసేవారు.
జీసస్ అలైహిస్సలాం మహిమలు చూపినంత మాత్రాన ఆయన స్థానం అల్లాహ్ యొక్క విధేయుడైన దాసుడి కంటే మరెంత మాత్రమూ ఎక్కువ కాలేదు. ఇది ఒక వాస్తవమైన విషయం. నిజానికి, అనేకమంది సందేశహరులు మహిమలు చేసి చూపారు, ఉదాహరణకు, నూహ్, మోసెస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఈ మహిమలన్నీ సందేశహరుడి ప్రామాణికతను ప్రజలు గుర్తించేందుకు కేవలం అల్లాహ్ యొక్క అనుజ్ఞతో సంభవించేవి.
జీసస్ అలైహిస్సలాం యొక్క అసలు సందేశం
పాతనిబంధనలలోని అబ్రహాం, నూహ్ మరియు జోనాహ్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలు ఎన్నడూ దేవుడు త్రైత్వంలో భాగమని బోధించలేదు మరియు జీసస్ అలైహిస్సలాం తమ సంరక్షకుడని నమ్మలేదు.
వారి సందేశం చాలా సింపుల్ గా ఉండేది: దేవుడు ఏకైకుడు మరియు కేవలం ఆయన మాత్రమే మీ సకల ఆరాధనలు పొందేందుకు అర్హడు మరియు యోగ్యుడు.
అనేక వేల సంవత్సరాల పాటు తను ఏకైకుడని, కేవలం తనను మాత్రమే ఆరాధించాలనే దివ్యసందేశంతో ప్రవక్తలను పంపి, తర్వాత హఠాత్తుగా జీసస్ కూడా దేవుడనే విశ్వాసాన్ని నాటేందుకు తన ఏకత్వ స్థాయి నుండి క్రిందికి దిగి, తాను త్రైత్వంలో భాగమంటూ సర్వలోక సృష్టికర్త తన దివ్యసందేశాన్ని మార్చాడనటం హేతుబద్దంగా ఉన్నదా?
అసలు వాస్తవం ఏమిటంటే, జీసస్ అలైహిస్సలాం కూడా పాతనిబంధనలలోని అసలు దివ్యసందేశాన్నే బోధించారు. బైబిల్ లోని ఈ భాగం నిజంగా ఆ మూలసందేశాన్నే ధృవీకరిస్తున్నది. “శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తమిచ్చెదనని గ్రహించి - “ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనదేది?” అని ఆయన నడిగెను.
అందుకు యేసు – ‘ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు.
నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ’” (మార్కు సువార్త 12:28-29) కాబట్టి, దేవుడు అద్వితీయుడు అనేది జీసస్ అలైహిస్సలాం బోధనల ప్రకారం అత్యంత ప్రధానమైన మరియు ముఖ్యమైన కమాండ్మెంటు.
ఒకవేళ జీసస్ యే స్వయంగా దేవుడైతే, ఆయనిలా పలికి ఉండేవారు, ‘నేనే దేవుడిని, నన్నే ఆరాధించండి.’ మరి ఆయన అలా చెప్పకుండా, పాతనిబంధనలలోని దివ్యసందేశాన్నే మరలా రిపీట్ చేస్తూ, ‘దేవుడు ఏకైకుడని’ ఎందుకు పునః నిర్ధారించారు?
ఇది అద్వితీయ ప్రభువును మాత్రమే విశ్వసించాలని బోధించిన ఇతర ప్రవక్తల దివ్యసందేశాన్ని మరలా నిర్ధారించేందుకు జీసస్ అలైహిస్సలాం ఇశ్రాయేలు సంతతి వైపుకు పంపబడినారనే ఇస్లాంలో బోధించబడిన జీసస్ అలైహిస్సలాం యొక్క మిషన్ తో ఏకీభవిస్తున్నది.
“మరియు, ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకుని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: ‘వాస్తవంగా నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకువచ్చాను. మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ట భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి. నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను.
కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం.’ ఖుర్ఆన్ 43:63-64
అల్లాహ్ యొక్క ఒక విధేయుడైన, గౌరవనీయుడైన సందేశహరుడిగా జీసస్ అలైహిస్సాం, అల్లాహ్ ఆజ్ఞలకు మనస్ఫూర్తిగా సమర్పించుకున్నారు. కాబట్టి, ఆయన కూడా ముస్లిం యే. ఎందుకంటే, ఎవరైతే సర్వలోక సృష్టికర్త, ప్రభువైన అల్లాహ్ అభీష్టానికి మరియు ఆజ్ఞలకు మనస్పూర్తిగా సమర్పించుకుంటారో, వారిని ముస్లింలు అంటారు.
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం
ఇస్లాం ధర్మంలో జీసస్ అలైహిస్సలాం ‘కేవలం అద్వితీయుడైన ప్రభువును మాత్రమే ఆరాధించమని’ ఇశ్రాయేలు సంతతివారిని ఆహ్వానించేందుకు పంపబడిన ఒక గొప్ప ప్రవక్త. ఇది బైబిల్ లో నిరూపించబడింది మరియు ఖుర్ఆన్ లో నిర్ధారించబడింది.
అసలు జీసస్ ఎవరు అనే సత్యాన్ని జీసస్ అలైహిస్సలాం గురించిన ఇస్లామీయ విశ్వాసం స్పష్టంగా వివరిస్తూ, అదే సమయంలో సర్వలోక సృష్టికర్త, ఆయన యొక్క సంపూర్ణమైన ఘనత, ఏకైకత మరియు పరిపూర్ణతల గురించిన స్వచ్ఛమైన విశ్వాసాన్ని కూడా పునరుద్ధరిస్తున్నది.
మీరొక అడుగు ముందుకు వేసి, ఇస్లాం గురించి మరింత పరిశోధించాలని మేము ఆహ్వానిస్తున్నాము.
ఇస్లాం ధర్మం అంటే కేవలం మరో ధర్మం కాదు. అది నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ అలైహిస్సలాంలు బోధించిన అదే దివ్యసందేశం. ఇస్లాం అనే అరబీ పదానికి అర్థం ‘సర్వలోక సృష్టికర్తకు సమర్పించుకొనుట’. ఇదొక ప్రకృతి సహజమైన మరియు సంపూర్ణమైన జీవన విధానం.
తమ ప్రభువుతో మరియు ఆయన యొక్క సృష్టితో మానవుడు కలిగి ఉండవలసిన గట్టి సంబంధంపై తగిన శ్రద్ధ చూపాలని ప్రోత్సహిస్తున్నది. సర్వలోక సృష్టికర్త అత్యంత న్యాయం చేసేవాడు మరియు అత్యంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాపవిమోచన కోసం స్వయంగా బలిచ్చుకోవలసిన అవసరం ఆయనకు ఎంత మాత్రమూ లేదు మరియు ఎవ్వరూ ఆదిపాపంతో జన్మించరని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది.
ఇంకా ప్రతి ఒక్కరినీ వారి వారి స్వంత ఆచరణల ఆధారంగా మాత్రమే సృష్టికర్త విచారిస్తాడు మరియు ప్రతి ఒక్కరూ తమ తమ స్వంత ఆచరణలకు మాత్రమే బాధ్యులని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది.
సృష్టికర్త పంపిన ప్రవక్తలందరినీ ప్రేమించాలని మరియు గౌరవించాలని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. కానీ, ప్రేమించుట మరియు గౌరవించుట అంటే వారిని ఆరాధించమని కాదు.
ఎందుకంటే, ఆరాధింపబడే అర్హత, యోగ్యత కేవలం సృష్టికర్తకు మాత్రమే ఉన్నది, సృష్టించబడిన వాటికి కాదు. జీసస్ ను అల్లాహ్ యొక్క ప్రవక్తగా గుర్తించుట మరియు ముస్లింగా మారుట అనేది మీ క్రైస్తవ ధర్మాన్ని వదిలిపెట్టడం లేదా త్యజించడంగా భావించవద్దు. వాస్తవానికి అది జీసస్ అలైహిస్సలాం యొక్క అసలు స్వచ్ఛమైన బోధనల వైపుకు మరలటంగా భావించాలి.